ఎమ్మెల్యే సురేఖ రాజీనామా హెచ్చరిక
వరంగల్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పర్యటన సందర్భంగా గురువారం భూపాలపల్లిలో తమ అనుచరులపై దాడికి నిరసనగా శాసనసభా సభ్యత్వానికి రేపు రాజీనామా చేస్తానని వరంగల్ జిల్లా శాయంపేట శాసనసభ్యురాలు కొండా సురేఖ కాంగ్రెస్ నాయకత్వాన్ని హెచ్చరించారు. 24 గంటల లోగా తన డిమాండ్లను తీర్చకపోతే నేరుగా స్పీకర్ కె. సురేష్ రెడ్డికి తాను రాజీనామా లేఖను పంపుతానని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. కార్యకర్తలకు రక్షణ కల్పించలేకపోయిన తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటేనని ఆమె అన్నారు. పార్టీ నాయకత్వం దిగిరాకపోతే తాను, తన భర్త మురళి రాజకీయాల నుంచి తప్పుకుంటామని ఆమె చెప్పారు.
భూపాలపల్లిలో తమ కార్యకర్తలపై దాడి చేసిన సిఐ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయాలని, తన అనుచరులపై దాడి చేసిన, దాడిన ప్రోత్సహించిన డిసిసి అధ్యక్షుడు గండ్ర వెంకటరమణారెడ్డిపై, ఆయన అనుచరులపై కేసులు పెట్టి వారిని అరెస్టు చేయాలని సురేఖ డిమాండ్ చేశారు. వెంకటేశ్వరరావు దాడిలో గాయపడిన కార్యకర్త వరంగల్లోని ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె తెలిపారు. కొండా సురేఖతో పాటు వెంకటరమణారెడ్డి భూపాలపల్లి టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. తనకు, తన భర్తకు శాసనసభ టికెట్లు ఇవ్వకపోతే రాజీనామా చేసి కాంగ్రెసు పార్టీ కార్యకర్తలుగా ఉంటామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications