ఎమ్మార్పీయస్ దాడులు, తాళాలు
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలంటూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) కార్యకర్తలు తమ ఆందోళనను ఉధృతం చేశారు. కార్యాలయాలపై దాడులు చేయడం, వాటికి తాళాలు వేయడం వంటి చర్యలకు దిగుతున్నారు. శుక్రవారం ఉదయం ఆందోళనకారులు సికింద్రాబాద్ ఆర్డీవో కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నీచర్ ను, కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయ ద్వారానికి తాళం వేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమావేశం జరుగుతుండగా ఎమ్మార్పీయస్ కార్యకర్తలు ఆ సమావేశం గది తలుపులు వేసి తాళం వేశారు.
ఎమ్మార్పీయస్ కార్యకర్తలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్యాలయం వద్ద, ఆర్టీఓ కార్యాలయం వద్ద ఆఫీసులకు తాళం వేసి ధర్నాలు చేశారు. ఉద్యోగులను లోనకు వెళ్లనీయమంటూ గేట్ల వద్ద బైఠాయించటంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. పటాన్‌చెరు, రాజమండ్రి, తాండూరు, వరంగల్, ఆదిలాబాద్ తదితర జిల్లాల ఆర్టీఓ ఆఫీసుల వద్ద కూడా ఇదే కార్యక్రమాన్ని వారు కొనసాగిస్తున్నారు. శనివారం వరకు ఎమ్మార్పీయస్ కార్యకర్తల ఆందోళన కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications