శ్రీశైలం : రేపు శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శివాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. మరీ ముఖ్యంగా శ్రీశైలంలో భక్తులు వెల్లువెత్తారు. జ్యోతిర్లింగక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు వేలాదిమంది భక్తులు తరలిరావడంతో భక్తజనంతో నిండిపోయింది. పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులతో నల్లమల అటవీప్రాంతం శివనామస్మరణతో పులకిస్తోంది. ఇరుముడి ధరించిన శివస్వాములతో ఆలయప్రాంగణం కిక్కిరిసిపోయింది. 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ఇప్పటికే వేలాదిమంది భక్తులు శ్రీశైలానికి చేరుకున్నారని ఆలయ అధికార్లు తెలిపారు.