రాజమండ్రి: ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి గుర్తుతోనే పోటీ చేస్తుందని, ఆ మేరకు ఈ నెల 16వ తేదీన కోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉందని ప్రజారాజ్యం పార్టీ అగ్రనేతలు నాగేంద్రబాబు, తమ్మినేని సీతారాం ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ నెల 10వ తేదీన రాజమండ్రిలో నిర్వహించ తలపెట్టిన సామాజిక న్యాయ శంఖారావం సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆదివారం వారిక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కన్వీనర్ చక్రవర్తితో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి గుర్తు వస్తుందని...ఒకవేళ రాకుంటే చిరంజీవి సింబలే తమకు ఉపయోగపడుతుందని అన్నారు. ప్రజల్లో ఎటువంటి గందరగోళం లేదన్నారు. ఈ నెల 15వ తర్వాత మొదటి జాబితా విడుదల చేస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి, ప్రజల్లోకి విస్త్రృతంగా వెళ్లేవారికి సీట్లు కేటాయిస్తామన్నారు. ఇప్పుడే తమకు టిక్కెట్టు వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నవారిని నమ్మకూడదన్నారు.