హైదరాబాద్: కూకట్‌పల్లిలో జేపీపై తప్పకుండా పీఆర్పీ అభ్యర్థి పోటీ చేస్తారని యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అలాగే ప్రజారాజ్యం కూడా కాంగ్రెస్, టీడీపీల తానులోని ముక్కే అన్న జేపీ వ్యాఖ్యలను పవన్ తప్పుబట్టారు. "ఐదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత మా పాలన చూసి ఓ అభిప్రాయానికి వస్తే తప్పు లేదు. కానీ, ఇప్పుడే పుట్టిన పీఆర్పీని ఆ రెండు పార్టీల గాటన కట్టడం ఏమిటి? రాజమండ్రి సభకు జనాన్ని తరలించడాన్ని ఆయన చూశారా?" అని ప్రశ్నించారు. అంతేగాక తాము చెబుతున్న సామాజిక న్యాయం ఎమ్మార్పీఎస్‌కు ఎందుకు అర్థం కాలేదో వారినే అడగాలని మరో ప్రశ్నకు జవాబిచ్చారు. కొందరికి ఎంత చెప్పినా అర్థం కాదన్నారు. గతంలో జెపీ పై ప్రజారాజ్యం పోటికీ నిలబడదని పీఆర్పీ ప్రకటించిన సంగతి విదితమే.