పెద్దల జోక్యంతో దిగొచ్చిన రాఘవులు

తమ కేంద్ర కమిటీ నాయకులు చెప్పడంతో తాను మహా కూటమి సమావేశానికి వెళ్తున్నట్లు చంద్రబాబు నివాసానికి బయలుదేరే ముందు రాఘవులు మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే తాము మంగళగిరి, వరంగల్ (తూర్పు) శాసనసభా నియోజకవర్గాల విషయంలో రాజీ పడేది లేదని చెప్పారు. రాఘవులు రాకతో మహా కూటమి సమావేశం ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు మహా కూటమి సమావేశం జరిగి ఆ తర్వాత ఉమ్మడి ప్రకటన చేయాల్సి ఉంది. 11 గంటలకు కాస్తా ఆలస్యంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అయితే తాము సమావేశానికి రావడం లేదంటూ రాఘవులు చంద్రబాబుకు ఒక లేఖాస్త్రం సంధించారు. దీంతో చంద్రబాబు రాయబారాలు నడపడమే కాకుండా స్వయంగా రాఘవులుకు ఫోన్ చేశారు. అయినా వినలేదు. దీంతో చంద్రబాబు సిపిఎం జాతీయ నాయకులతో మాట్లాడారు. దాంతో వివాదానికి తెర పడింది.
మంగళవారం నాటి సమావేశంతో మహా కూటమిలో గత కొద్ది రోజులుగా సీట్ల సర్దుబాటులో ఏర్పడిన గందరగోళానికి తెర పడే సూచనలు కనిపిస్తున్నాయి. సోమవారంనాడు తెలుగుదేశం, తెరాసలకు మధ్య నెలకొన్న వివాదం రాత్రి చంద్రబాబు, కెసిఆర్ ల సమావేశంతో ముగిసింది. దాంతో సిపిఐకి కేటాయించిన హుస్నాబాద్ శాసనభ స్థానానికి వేసిన నామినేషన్ ను ఉపసంహరించుకోవాలని కెసిఆర్ తమ అభ్యర్థి కెప్టెన్ లక్ష్మీకాంతరావును ఆదేశించారు. సిపిఎం కావాలని పట్టుబడుతున్న మంగళగిరి సీటును సిపిఐకి, వరంగల్ తూర్పు స్థానాన్ని తెరాసకు కేటాయించారు.












Click it and Unblock the Notifications