రాహుల్ వ్యాఖ్యలపై మమత గరం
కోల్‌కతా: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ వామపక్షాల మద్దతు కోరే ఉద్దేశం ఉంటే యుపిఎ కూటమి నుంచి తాము వైదొలుగుతామని మమత స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో నిన్న ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో చంద్రబాబు, నితీష్ కుమార్‌లపై ప్రసంశల జల్లు కురిపించిన రాహుల్ గాంధీ, అవసరమైతే వామపక్షాలకు తామే మద్దతిస్తామని చెప్పి విప్లవ యోధులకు కితకితలు పెట్టడం తెలిసిందే.
సహజంగానే రాహుల్ ప్రసంగం లాలూ, పాశ్వాన్, ములాయంకు ఆగ్రహం కలిగించగా, వామపక్షాలకు బద్ద శత్రువైన మమతకు కూడా రాహుల్ వ్యాఖ్యలు మింగుడు పడలేదు. రాహుల్ భవిష్యత్ దృశ్యాన్ని ఊహిస్తూ నిక్కచ్చిగా పలికించిన ఈ పదనిసలు కాంగ్రెస్‌కు మేలు చేయకపోగా కీడే చేశాయన్నది పరిశీలకుల విశ్లేషణ. రాహుల్ వ్యాఖ్యలను విని నితీష్ సంతోషించకపోగా, తాము ఎన్డీఎని వీడేది లేదని తేల్చి చెప్పారు. ఇక చంద్రబాబు సంగతి సరేసరి. వామపక్షాలు కూడా రాహుల్ వ్యాఖ్యలను అసందర్భ ప్రేలాపనలుగా కొట్టి పారేశాయి. దీనితో యుపిఎ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారయ్యింది. అయితే రాహుల్ మాటలు 'మార్పు' కోరుతున్న యువతను ఆకట్టుకున్నాయనడంలో సందేహం లేదు.












Click it and Unblock the Notifications