ఎగ్జిట్ పోల్స్ ను పూర్తిగా నమ్మవచ్చా?
హైదరాబాద్: ఎగ్జిట్ పోల్స్ ను ఎంతవరకు నమ్మవచ్చు? గతంలోకి వెళ్లి చూద్దాం. 2004 ఎన్నికల సమయంలో వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌ను, అసలు ఫలితాలను గమనిస్తే... చాలా సంస్థలు ఓటరు నాడిని పసిగట్టడంలో బోల్తా పడ్డాయని అర్థమౌపోతుంది. 2004లో ఆజ్‌తక్, ఎన్డీటీవీ, సహారా, స్టార్ న్యూస్, జీన్యూస్ చానళ్ల ఎగ్జిట్ పోల్స్ సగటుకు, అసలు ఫలితాలకు భారీతేడా కనిపించింది. అప్పట్లో ఈ సంస్థలన్నీ ఎన్డీఏకు ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేశాయి. వీటన్నిటి సగటు అంచనా ప్రకారం ఎన్డీఏకు 255 సీట్లు రావాలి. కానీ...187 మాత్రమే వచ్చాయి.
యూపీఏకు 183 స్థానాలు వస్తాయని పేర్కొనగా... ఆ సంఖ్య 219కి చేరుకుంది. ఇతరుల విషయంలోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనా తప్పింది. ఇతర పార్టీలకు 105 స్థానాలు వస్తాయని పేర్కొనగా...అంతకంటే 32 సీట్లు ఎక్కువ వచ్చాయి. మొత్తమ్మీద మిగిలిన సంస్థల కంటే ఎన్డీటీవీ ఎగ్జిట్‌పోల్స్ అసలు ఫలితాలకు దగ్గరగా వచ్చాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, ఒరిస్సా, పంజాబ్‌లలో ఎన్డీటీవీ ఎగ్జిట్‌పోల్స్ అతి స్వల్పతేడాతో నిజమయ్యాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్‌లకు సంబంధించి ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ వందశాతం నిజమయ్యాయి.
బీహార్ లో మాత్రం యూపీఏకు 18 స్థానాలు వస్తాయని చెప్పగా...28 సీట్లు వచ్చాయి. అంటే..తేడా 40 శాతం. ఇక...తమిళనాడులో 21 శాతం, గుజరాత్‌లో 22 శాతం, అస్సాంలో 28 శాతం, జార్ఖండ్‌లో 36 శాతం, హర్యానాలో 30 శాతం హిమాచల్ ప్రదేశ్‌లో ఏకంగా 50 శాతం తేడా వచ్చింది. కేరళ విషయంలో ఎన్డీటీవీ పూర్తిగా తప్పులో కాలేసింది. అక్కడ కాంగ్రెస్‌కు 13, లెఫ్ట్‌కు 7 సీట్లు వస్తాయని ఎగ్జిట్‌పోల్స్‌లో పేర్కొనగా ...అసలు ఫలితం పూర్తి విరుద్ధంగా వచ్చింది. కాంగ్రెస్ ఒక్కచోట కూడా బోణీ కొట్టలేదు. లెఫ్ట్ ఏకంగా 18 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తమ్మీద చిన్న రాష్ట్రాల విషయంలో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు వాస్తవాలను అంతగా ప్రతిబింబించలేదు. బహుముఖ పోటీ ఉన్న రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందో మరో 36 గంటలు వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications