జూ ఎన్టీఆర్ కూడా మేజర్ ఫ్లాప్!
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ రోడ్ షోలకు జనం పెద్ద ఎత్తున హాజరై అహో, ఒహో అన్నప్పటికీ అవి మహా కూటమికి ఓట్లుగా మారలేకపోయాయి. ప్రచారంలో ఆయన వాక్చాతుర్యం, ఆహార్యం చూసి అంతా సీనియర్ ఎన్టీఆర్‌ను గుర్తుకు తెచ్చుకున్నారు. ఉత్తరాంధ్రలోని ఐదు జిల్లాలు, తెలంగాణలోని ఒక జిల్లాలో పర్యటించగా ప్రజలు అడుగడుక్కీ బ్రహ్మరథం పట్టారు. ఆయన మాటలు తూటాల్లా పేలాయి. ఈ స్పందన చూసి ఘన విజయం ఖాయమని కూటమి వర్గాలు భావించాయి. వూహించని విధంగా ఆ తర్వాత ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రచారం నిలిచిపోగా కూటమిలో ఆందోళన వ్యక్తమైంది.
మొదటి విడత, రెండో విడత ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఇంటి నుంచే ఆయనతో టీవీల్లో సందేశం ఇప్పించారు. తీరా చూస్తే ఎన్నికల్లో భిన్న ఫలితాలు వచ్చాయి. ఆయన ప్రచారం చేసిన చోట కూటమికి సాదాసీదా విజయాలు మాత్రమే దక్కాయి. మొదటి, రెండో విడత ఎన్నికలు జరిగిన మొత్తం 72 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆయన పర్యటించగా అందులో 19 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఆయన పర్యటించిన 11 ఎంపీ స్థానాల్లో ఒక దానిని (ఖమ్మం) మాత్రమే కూటమి కైవసం చేసుకుంది.
శ్రీకాకుళం జిల్లాలోని 10 స్థానాల్లో 1, విజయనగరంలోని 9 స్థానాల్లో 2, విశాఖపట్నంలోని 15 స్థానాల్లో 4, తూర్పుగోదావరిలోని 19 స్థానాల్లో 4, పశ్చిమగోదావరిలోని 15 స్థానాల్లో 5 కూటమి గెల్చుకుంది. ఖమ్మం జిల్లాల్లో నాలుగింటిలో ఆయన ప్రచారం చేయగా అందులో మూడింట కూటమికి విజయం దక్కింది. ఖమ్మం లోక్‌సభ స్థానంలోనూ తెదేపా విజయం సాధించింది.












Click it and Unblock the Notifications