బస్సు దూసుకెళ్లి వ్యక్తి మృతి
కర్నూలు: కర్నూలు జిల్లా శ్రీశైలంలో శుక్రవారం తెల్లవారుజామున ప్రయాణికులపై నుంచి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. ఇతన్ని ఆదిలాబాద్ జిల్లా నారాణపూర్ గ్రామానికి చెందిన ఎస్కే సర్వర్ గా గుర్తించారు. సర్వర్ తన కుటుంబ సభ్యులతో గురువారంనాడు శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని దర్శించుకున్నాడు. మొత్తం 11 మంది కుటుంబ సభ్యులు శ్రీశైలం వచ్చారు.
గురువారం రాత్రి వారంతా బస్ స్టాండులోనే పడుకున్నారు. మిగతా కుటుంబ సభ్యులంతా శుక్రవారం ఉదయం మళ్లీ స్వామివారి దర్శనానికి వెళ్లారు. సర్వర్ మాత్రం పడుకుని ఉన్నాడు. ఆ సమయంలో సాయిశ్రీ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రయాణికుల మీది నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సర్వర్ మృతి చెందాడు. బ్రేకులు ఫెయిల్ కావడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.












Click it and Unblock the Notifications