రేవతీపతి మృతికి అసెంబ్లీ నివాళి
హైదరాబాద్: గుండెపోటుతో మృతిచెందిన టెక్కలి శాసనసభ్యుడు రేవతీపతి మృతికి శాసనసభ శుక్రవారం నివాళి తెలిపింది. రేవతీపతి మృతిపై ముఖ్యమంత్రి సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆయా పక్షాల నాయకులు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మంచి వైద్యుడిగా పేరుగడించిన రేవతీపతి ప్రజాసేవే పరమావధిగా పనిచేశారని ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. రేవతీపతి మృతి అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని ఆయన అన్నారు. సభలో మన మధ్య ఉండాల్సిన వ్యక్తి అకాల మరణంతో మనందరికి దూరమవడం ఎంతో బాధగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో చురుగ్గా పనిచేశారని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
రేవతీపతి అసెంబ్లీలో మంచి వక్తగా పేరుతెచ్చుకున్నారని, ఆయన మరణం మనందరికీ తీరనిలోటు అని విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢసానుభూతిని తెలియజేశారు. తెరాస నేత ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నేత ధర్మాన ప్రసాదరావు తదితరులు రేవతీపతి మృతికి తమ సంతాపాన్ని తెలిపారు.












Click it and Unblock the Notifications