సిఎఎల్పీపై వైయస్ జగన్ లాబీ దృష్టి

మరి కొంత కాలం రోశయ్యను ముఖ్యమంత్రిగా కొనసాగించవచ్చుననే ఆందోళనలో కూడా జగన్ శిబిరం ఉంది. అది జరగకుండా చూడడం ఇప్పుడు ఆ వర్గం కర్తవ్యంగా కనిపిస్తోంది. ఈ నెల 10, 11 తేదీల్లో సిఎల్పీ సమావేశం జరుగుతుందని భావిస్తోంది. వైయస్ సంతాప దినాలు ముగిసే వరకు తాము కొత్త నేతపై దృష్టి సారించబోమని పార్టీ అధిష్ఠాన వర్గం చెబుతోంది. సమయం తీసుకోవడానికి మాత్రమే అధిష్ఠాన వర్గం ఆ మాట చెబుతుందనేది తెలిసిపోతూనే ఉంది. ఇదే సమయంలో అన్ని వర్గాల నుంచి జగన్ కు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక వైపు ఆందోళనల ద్వారా ఒత్తిడి పెడుతూ, మరోవైపు శాసనసభ్యుల పూర్తి మద్దతు సంపాదించడం ద్వారా అధిష్ఠాన వర్గం అభిప్రాయాన్ని జగన్ కు అనుకూలంగా మలచాలనేది ఆ శిబిరం ఆలోచనగా తెలుస్తోంది.
అయితే, కొత్త నేత ఎంపిక అంత ఆషామాషీగా జరిగే వ్యవహారం కాదు. కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం తన నిర్ణయానికి అనుకూలంగా శాసనసభ్యులు అభిప్రాయాన్ని కూడగట్టుకున్న తర్వాతనే సిఎల్పీ సమావేశానికి పూనుకుంటుంది. వైయస్ జగన్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలంటే అది అవసరం లేదేమో గానీ మరొకరిని ఎంపిక చేయదలుచుకుంటే మాత్రం కసరత్తుకు ఎక్కువ కాలమే పడుతుంది. అయితే ఇప్పటికిప్పుడు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తారని కూడా అనుకునే పరిస్థితి లేదు. అధిష్ఠాన వర్గం జగన్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకోదలుచుకున్నా ఇప్పటికిప్పుడు ఒత్తిడికి తలొగ్గినట్టు కనిపిస్తుంది. అలా తలొగ్గినట్లు కనిపించకుండా ఉండడానికి కూడా సమయం తీసుకోవచ్చు. ఏమైనా జగన్ కోసం పెద్ద యెత్తున ఢిల్లీలో లాబీయింగ్ జరుగుతోంది.












Click it and Unblock the Notifications