జగన్ దిగి వచ్చేదాకా...

శనివారం ఢిల్లీ వెళ్లిన వైయస్ ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావు రాత్రి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ, సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ లతో సమావేశమయ్యారు. ఆదివారం ప్రణబ్ ముఖర్జీతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశం జరిగేలా చూసే వ్యూహాన్ని జగన్ వర్గం అనుసరిస్తోంది. ఈ సమావేశంలో తమ మెజారిటీని రుజువు చేసి పార్టీ అధిష్ఠాన వర్గానికి స్పష్టమైన సందేశం ఇవ్వాలనేది ఆ వర్గం ఆలోచన. అయితే శాసనసభ్యుల్లోనూ మంత్రుల్లోనూ పార్లమెంటు సభ్యుల్లోనూ జగన్ కు మెజారిటీ ఉందనే విషయం అధిష్ఠాన వర్గానికి తెలియని విషయమేమీ కాదు. జగన్ వర్గం వ్యూహాన్ని అడ్డుకోవడమే పార్టీ అధిష్ఠాన వర్గం ప్రస్తుత ఆలోచనగా కనిపిస్తోంది.
మరి కొంత వాతావరణం చల్లబడిన తర్వాత జగన్ ను పార్టీ అధిష్ఠాన వర్గం ఢిల్లీకి పిలిపించే అవకాశాలున్నాయి. వచ్చే నెల 13వ తేదీ లోగా ఎప్పుడైనా సిఎల్పీ సమావేశం పెట్టవచ్చుననే మాట వినిపిస్తోంది. అంటే, ఆశలు సజీవంగా ఉంచుతూనే జగన్ వర్గాన్ని తన మాటకు కట్టుబడేలా చేయడం పార్టీ అధిష్ఠాన వర్గం ఎత్తుగడగా భావించవచ్చు. జగన్ పూర్తిగా దిగి వచ్చేదాకా వ్యవహారాన్ని వ్యవహారాన్ని పార్టీ అధిష్టాన వర్గం సాగదీస్తుందనేది కచ్చితంగానే చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications