జాబిల్లిపై నీరు ఎక్కువే: మాధవన్

చంద్రయాన్ ప్రధాన లక్ష్యం నెరవేరిందని, చందమామపై నీరుందని కనిపెట్టడం గొప్ప విజయమని తాను ప్రపంచానికి చాటి చెప్పగలనని ఆయన అన్నారు. చంద్రయాన్ సేకరించిన వివరాలను విశ్లేషించడానికి ఆరు నెలల నుంచి మూడేళ్ల కాలం పడుతుందని ఆయన అన్నారు. చంద్రుడి ధృవ ప్రాంతంలో జలం, హైడ్రాక్సైల్ ఉన్నట్లు తేలిందని ఆయన చెప్పారు. జలం సముద్ర, సరస్సు రూపాల్లో గానీ బిందువుల రూపాల్లో గానీ లేదని, చందమామపై గల ఖనిజాలతో కలిసి ఉందని ఆయన వివరించారు. అటువంటి పదార్థాలు అంచనాకు మించే ఉన్నాయని ఆయన అన్నారు.
చంద్రుడిపై జలం ఎలా ఉందనేది ఇప్పటికీ ఆశ్చర్యమేనని ఆయన అన్నారు. చంద్రుడి ఉపరితలంపైకి నిరంతరాయంగా వీస్తున్న సౌర గాలుల వల్ల జలం తయారై ఉండవచ్చునని ఆయన అన్నారు. సౌర గాలుల్లో ఉండే హైడ్రోజన్ చంద్రుడి ఉపరితలంపై గల ఖనిజాల్లోని ఆక్సిజన్ తో కలిసి జలం ఏర్పడి ఉంటుందని ఆయన వివరించారు. జలం పరమాణువులు ఉన్నంత మాత్రాన చంద్రుడిపై జీవనం సాగించడానికి వీలవుతుందని చెప్పలేమని ఆయన అన్నారు. చంద్రుడిపై శాశ్వత పునాది ఏర్పాటుకు అవకాశాలు లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications