హైదరాబాద్: రోశయ్య ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు అవసరమైన బల నిరూపణ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని సోమవారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. కాంగ్రెస్ పార్టీలో మెజార్టీ ఎమ్మెల్యేలు జగన్‌కే మద్దతిస్తున్నట్లు బహిరంగంగా వ్యాఖ్యానిస్తూ ఉండడంతో రాజ్యాంగ నిబంధన ప్రకారం రోశయ్యను బలం నిరూపించుకోవాలని ఆదేశాలు ఇవ్వాలని నెల్లూరుకు చెందిన కాంగ్రెస్ నేత బెజవాడ గోవింద రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొంత మంది ప్రజాప్రతినిధులు తాము వైయస్ జగన్ కే మద్దతిస్తున్నామని సంతకాలు చేసిన మెమొరాండం, రోశయ్య ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా మంత్రులు, కొంత మంది ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యల సిడిని గోవింద రెడ్డి కోర్టుకు సమర్పించారు. ఈ ఆధారాలను పరిశీలించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది.