హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. తన తల్లి విజయలక్ష్మితో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. వారిద్దరు సోమవారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తారని జగన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సోనియా గాంధీ కూడా భేటీకి సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెసులోని తాజా పరిణామాలపై, పులివెందులలో పోటీపై, కొండా సురేఖ రాజీనామాపై తదితర విషయాలపై జగన్ సోనియాతో మాట్లాడనున్నట్లు సమాచారం.
రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని జగన్ ఆశిస్తున్నారు. అందుకుగాను తన తండ్రి మరణం వల్ల ఖాళీ అయిన పులివెందుల నుంచి శాసనసభకు పోటీ చేయాలని అనుకుంటున్నారు. జగన్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నందున జగన్ ను పులివెందుల నుంచి పోటీ దించడంపై సోనియా విముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఆమె అభిప్రాయం తెలుకునేందుకు తల్లితో కలిసి ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం.