చర్యకు రోశయ్య భయపడుతున్నారు: చంద్రబాబు

ఓబుళాపురం అక్రమాలను ఆపే వరకు పోరాటం చేస్తామని, జాతీయ స్థాయిలో కూడా పెద్ద యెత్తున ఆందోళనకు దిగుతామని ఆయన చెప్పారు. ఓబుళాపురం మైనింగ్ లో వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన జగతి పబ్లికేషన్స్ , ఆర్ఆర్ గ్లోబల్, రెడ్ గ్లోబల్ సంస్థలకు డబ్బులు అందుతున్నాయని ఆయన చెప్పారు. ఓబుళాపురం గనుల స్థలానికి ప్రధాని కూడా వెళ్లలేని స్థితి ఉందని, సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డికి, తనకు మధ్య తండ్రీ కొడుకుల సంబంధం ఉందని కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అనడాన్ని ప్రస్తావిస్తూ ఆ సంబంధం ఉంది కాబట్టే గనులను అప్పనంగా కట్టబెట్టారని ఆయన వ్యాఖ్యానించారు.
ఓబుళాపురం గనుల అధిపతి రాజకీయాలను కలుషితం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఓబుళాపురం గనుల వ్యవహారంపై చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి కె.రోశయ్య కాలయాపన చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఓబుళాపురం గనుల వ్యవహారంపై ప్రజారాజ్యం, తెలంగాణ రాష్ట్ర సమితి, బిజెపిలను కూడా ఆహ్వానించామని, ఎందుకో ఆ పార్టీలు పాలు పంచుకోవడం లేదని, అయినా తమ పోరాటం ఆగదని ఆయన అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, లోకసత్తా నాయకులు కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications