హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ అభ్యర్థిగా కాంగ్రెసు పార్టీ నాయకత్వం హబ్సిగుడా కార్పొరేటర్ హరివర్ధన్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ముఖ్యమంత్రి కె.రోశయ్య, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ శుక్రవారం ఉదయం గాంధీభవన్ లో కాంగ్రెసు కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. మేయర్ అభ్యర్థి పేరును పార్టీ నాయకత్వానికి అప్పగిస్తూ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దీంతో హరివర్దన్ రెడ్డి పేరును పార్టీ నాయకత్వం ఖరారు చేసింది. కాంగ్రెసుకు మజ్లీస్ తో కుదిరిన ఒప్పందం మేరకు ఆయన తొలి రెండేళ్ల పాటు మేయరుగా కొనసాగుతారు.
మేయర్ పదవిని కాంగ్రెసు మూడేళ్లు, మజ్లీస్ రెండేళ్లు చేపట్టే విధంగా ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. తొలి రెండేళ్లు, చివరి ఏడాది కాంగ్రెసుకు మేయర్ పదవి ఇచ్చేట్లుగా, మూడు, నాలుగు ఏళ్లలో తాము మేయర్ పదవి చేపట్టేలా మజ్లీస్ ఒప్పందం చేసుకుంది. చివరి ఏడాది కాంగ్రెసు కార్పొరేటర్ కాలేరు వెంకటేశ్వర్లు మేయరు పదవిని నిర్వహిస్తారు. మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత రోశయ్య, శ్రీనివాస్ గాంధీ భవన్ లో కార్పొరేటర్లకు ఇచ్చిన అల్పాహార విందులో పాల్గొన్నారు.