హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు శుక్రవారం ఉదయం తెలిపారు. ఆరోగ్యం సాధారణంగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారన్నారు. కెసిఆర్ కు శుక్రవారం వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు. కెసిఆర్ ఆరోగ్యం విషమించినట్లు గురువారం రాత్రి ఊహాగానాలు చెలరేగాయి.
కెసిఆర్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ జయశంకర్ ప్రకటించారు. కెసిఆర్ బిపి కాస్తా పెరిగినట్లు చెబుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి శ్రీకాంత్ మరణించాడనే వార్త అందడంతో కెసిఆర్ తీవ్రంగా కలత చెందినట్లు చెబుతున్నారు. దాంతోనే ఆయన బిపి పెరిగిందని అంటున్నారు. శ్రీకాంత్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు.