న్యూఢిల్లీ: తెలంగాణ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చినట్లు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ గౌడ్ చెప్పారు. ప్రధానితో తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల భేటీ అనంతరం ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా చర్యలు తీసుకుంటామని ప్రధాని చెప్పినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీలతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ప్రధాని చెప్పినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణకు కాంగ్రెసు సానుకూలంగా ఉందని, వ్యతిరేకంగా లేదని తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని మన్మోహన్ సింగ్ తమను అడిగినట్లు ఆయన చెప్పారు. సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని ప్రధాని చెప్పినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేత దీక్ష విరమింపజేయాలని ఆయన తమకు సూచించినట్లు ఆయన తెలిపారు. తాజా తెలంగాణ పరిణామాలపై తాము ప్రధానికి వివరించామని ఆయన చెప్పారు.