హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. అత్యవసర సేవలు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) డైరెక్టర్ ప్రసాదరావు చెప్పారు. ఎప్పుడైనా ఐసియులోకి తరలించే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష శనివారంనాటికి ఏడో రోజుకు చేరుకుంది. నిమ్స్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అదనవు బలగాలను రప్పించారు.
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ హామీ ఇస్తే తప్ప తాను దీక్షను విరమించబోనని కెసిఆర్ చెప్పారు. కాగా, తెలంగాణ మంత్రుల నుంచి తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి కె. రోశయ్యపై, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పై ఒత్తిడి పెరుగుతోంది.