సామూహిక వివాహ వేదికపై ఎమ్మెల్యే పెళ్లి.. ఎడ్లబండిపై ఊరేగింపు (వీడియో)
రాజకీయాల్లో అధిక ఆడంబరాలు, వీఐపీ సంస్కృతి, భారీ వివాహ ఖర్చులు సర్వసాధారణమైన ఈ తరుణంలో ఛత్తీస్‌గఢ్ నుంచి ఓ ప్రత్యేక ఆదర్శం కనిపించింది. బెమెతారా అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యే దీపేష్ సాహూ విలాసవంతమైన హోటళ్ళు, రిసార్ట్‌లలో కాకుండా, సమాజానికి ఓ గొప్ప సందేశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం, ఎమ్మెల్యే దీపేష్ సాహూ ప్రభుత్వ పథకం కింద జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. 'ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన' ద్వారా, ఆయన ఒక సామాన్య డ్రైవర్ కుమార్తె తరుణా సాహూని వివాహం చేసుకున్నారు. ఆమె తల్లి గృహిణి. ఈ వేడుకలో ఎమ్మెల్యేతో సహా మొత్తం 23 జంటలు వివాహబంధంలోకి అడుగుపెట్టాయి.
ఛత్తీస్‌గఢ్ చరిత్రలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే 'ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన' కింద సామూహిక వేదికపై పెళ్లి చేసుకోవడం ఇదే ప్రథమం. సంప్రదాయానికి ప్రాధాన్యతనిస్తూ, వరుడు దీపేష్ సాహూ అలంకరించిన ఎడ్లబండిపై వివాహ వేదికకు చేరుకున్నారు. ఎలాంటి విలాస వాహనాలు లేకుండా సాగిన ఈ బారాత్‌కు ఉప ముఖ్యమంత్రి అరుణ్ సావ్ స్వయంగా సారథ్యం వహించి ఎడ్లబండిని నడిపారు.

ఈ చారిత్రక, నిరాడంబర వివాహంలో నూతన వధూవరులను ఆశీర్వదించడానికి ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్, అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ రమన్ సింగ్ బెమెతారాకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దీపేష్ సాహూ మాట్లాడుతూ, "నేడు వివాహాలలో అనవసరమైన ఆడంబరం, ఖర్చులు పెద్ద సమస్యగా మారాయి. సామూహిక వివాహాలు సమాజానికి సానుకూలమైన మార్గాన్ని చూపించే గొప్ప ప్రయత్నం" అని స్పష్టం చేశారు.
बेमेतरा विधायक दीपेश साहू ने रविवार को सामूहिक विवाह समारोह में शादी हुई। मुख्यमंत्री कन्या विवाह योजना के तहत आयोजित कार्यक्रम में BPL परिवार की तरुणा साहू के साथ सात फेरे लिए। pic.twitter.com/mdmfktkpQG
— Haribhoomi (@Haribhoomi95271) May 31, 2026
సుమారు దశాబ్ద కాలం ఉపాధ్యాయుడిగా పనిచేసిన దీపేష్ సాహు 2023లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ 'ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన' కింద వధువుకు ₹35,000 ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తాన్ని తన వ్యక్తిగత అవసరాలకు కాకుండా, ప్రతిభావంతులైన విద్యార్థినుల ఉన్నత విద్యకు దానం చేస్తానని సాహూ ప్రకటించారు. ఈ నిర్ణయంపై అన్ని వర్గాల నుండి విస్తృత ప్రశంసలు లభించాయి.












Click it and Unblock the Notifications