"హరిహర్ కోట" లో అడ్వెంచర్ ట్రెక్కింగ్.. ఇది కదా రియల్ లైఫ్ ఎక్స్ పీరియన్స్ అంటే..?
మహారాష్ట్రలో అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. సాహసయాత్రకు అనువైన కోటలు కూడా ఉన్నాయి. మహారాష్ట్ర పశ్చిమ కనుమలలో సహ్యాద్రి శ్రేణుల పర్వతాల మధ్య నెలకొని ఉంది. ఇక్కడి కోటలు, కట్టడాలను చూసేందుకు టూరిస్టులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. అలాగే మహారాష్ట్రలో ప్రసిద్ధమైన హిల్ స్టేషన్స్ కూడా దాగి ఉన్నాయి.
మహాబలేశ్వర్, లోనావాలా- ఖాండాలా, మాథెరాన్, చిఖల్ దరా తదితర ప్రాంతాలు పర్యటకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి. అలాగే భండర్దరా, తోసేఘర్ జలపాతం, లోనార్ సరస్సు కూడా మహారాష్ట్రలో చాలా ఫేమస్.. ఇక్కడి లోహగఢ్ ఫోర్ట్ కు కూడా చాలా పెద్ద చరిత్రే ఉంది. లోహగఢ్ ఫోర్ట్ లో ట్రెక్కింగ్ కోసం అనేక మంది పర్యాటకులు తరలివస్తుంటారు.
అయితే మహారాష్ట్ర నాసిక్ లోని హరిహర్ కోట గురించి తెలుసా..? ఈ ప్రాంతాన్ని హర్షగఢ్ అని కూడా పిలుస్తుంటారు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 3, 676 అడుగుల ఎత్తులో ఉంది. ఈ కోటను 9, 14వ శతాబ్దంలో యాదవ వంశం రాజులు నిర్మించారు.
ఈ కోటపైన శివాలయం, హనుమాన్ ఆలయం, పుష్కరిణి, రాతి గుహలు ఇలా అనేక కీలక ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ట్రెక్కింగ్ చేయడం పెద్ద సాహసమే అని చెప్పాలి. ప్రమాదం అంచున ప్రయాణంగా అనిపిస్తుంది. ఇక్కడి రాతి కోటపై చెక్కిన మెట్లు 90 డిగ్రీల కోణంలో ఉంటాయి.
One of the most difficult treks is Harihar Fort in Maharashtra! pic.twitter.com/m0HR2Sogz7
— Harsh Goenka (@hvgoenka) June 17, 2026
ఏ మాత్రం పట్టు జారినా ప్రాణాలతో చెలగాటమే.. అంత అడ్వెంచరస్ గా ఈ కోట ట్రెక్కింగ్ ఉంటుంది. సాధారణ ప్రజలు ఈ కోటను ట్రెక్కింగ్ చేయాలంటే అసాధ్యం అనే చెప్పాలి. గుండె నిండా ధైర్యం, ఓర్పు, సహనం, ఆత్మ విశ్వాసం కలిగిన వారు మాత్రమే ఈ సాహసయాత్రను పూర్తిచేయగలరు. అందుకే హరిహర్ కోట ట్రెక్కింగ్ భారత్ లోని అత్యంత కఠినమైన ట్రెక్కింగ్‌లలో ఒకటిగా చెబుతారు. ఇక అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ కోటను సందర్శించడానికి అనువైన సమయంగా చెబుతారు.

హరిహర్ కోట ప్రాంతం నాసిక్ నగరం నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాసిక్ లేదా ఇగత్ పురి రైల్వే స్టేషన్లలో దిగి అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాలు లేదా బస్సుల ద్వారా ఈ గ్రామానికి చేరుకోవచ్చు. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం ఈ ప్రాంతానికి సమీపదూరంలోనే ఉంటుంది.












Click it and Unblock the Notifications