రిజిస్టర్ మ్యారేజ్ చెల్లదు: హై కోర్టు షాకింగ్ తీర్పు
హిందూ వివాహాల చెల్లుబాటుపై హైకోర్టు అత్యంత కీలకమైన, సంచలన తీర్పును వెలువరించింది. మతాచారాల ప్రకారం సాంప్రదాయక కర్మలు, 'సప్తపది' (పవిత్ర అగ్ని సాక్షిగా వధూవరులు ఏడు అడుగులు నడవడం) వంటి క్రతువులు నిర్వహించకుండా, కేవలం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందినంత మాత్రాన ఆ వివాహం చట్టబద్ధంగా చెల్లదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. వివాహం అనేది కేవలం "పాటలు, డాన్సులు" లేదా "విందు, వినోదాల"తో ముగిసిపోయే వేడుక కాదని, భారతీయ సమాజంలో అదొక అత్యున్నత పవిత్ర సంస్కారమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
యూకే (UK) లో నివసిస్తున్న కౌశల్ సోనార్ అనే యువకుడి అప్పీలును విచారించిన జస్టిస్ ఇలేష్ వోరా, జస్టిస్ ఆర్.టి. వాచ్ఛానీలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ సంచలన తీర్పును ఇచ్చింది. కౌశల్ సోనార్ తనకు తెలియకుండా, ఎటువంటి హిందూ సాంప్రదాయాలు నిర్వహించకుండా, మోసపూరితంగా సంతకాలు సేకరించి సృష్టించిన వివాహ ధృవీకరణ పత్రాన్ని (మ్యారేజ్ సర్టిఫికేట్) సవాలు చేస్తూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.

అయితే అక్కడ అతనికి చుక్కెదురు కావడంతో హైకోర్టులో అప్పీల్ చేశాడు. సదరు యువతి కూడా తామిద్దరం ఎప్పుడూ భార్యాభర్తలుగా కలిసి జీవించలేదని, ఎలాంటి వివాహ క్రతువులు జరగలేదని కోర్టు ముందు అంగీకరించింది. దీంతో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన పాత ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు ఆ వివాహాన్ని రద్దు చేసింది.
హిందూ వివాహ చట్టం సెక్షన్ 7 ఏం చెబుతోంది?
హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం.. ఒక హిందూ వివాహం చట్టబద్ధంగా పరిపూర్ణమై, బంధాన్ని ఏర్పరచాలంటే ఆయా సంస్కృతులు, భౌగోళిక ప్రాంతాల ఆధారంగా ఉండే సాంప్రదాయక ఆచారాలను ఖచ్చితంగా పాటించాలని హైకోర్టు గుర్తుచేసింది. ముఖ్యంగా అగ్ని సాక్షిగా నడిచే 'సప్తపది' అనేదే హిందూ వివాహానికి పునాది అని కోర్టు స్పష్టం చేసింది. ఏడు అడుగుల క్రతువు పూర్తయినప్పుడే ఆ వివాహానికి ఆధ్యాత్మిక, సామాజిక, చట్టపరమైన హోదా లభిస్తుందని ధర్మాసనం వివరించింది. ప్రస్తుత కేసులో ఎలాంటి ఆచారాలు జరగనందున, వివాహానికి ఉండాల్సిన ప్రాథమిక అర్హతలే ఇక్కడ లోపించాయని కోర్టు పేర్కొంది.
భార్య అంటే 'అర్ధాంగి'.. యువతకు కోర్టు హితవు!
"హిందూ సాంప్రదాయంలో భార్యను భర్తలో సగభాగంగా (అర్ధాంగిగా) భావిస్తారు. అదే సమయంలో ఆమెకు స్వయం గుర్తింపు, వివాహంలో సమాన భాగస్వామ్యం ఉంటాయి. హిందూ చట్టం ప్రకారం వివాహం అనేది ఒక పవిత్ర సంస్కారం. ఇది ఒక కొత్త కుటుంబానికి పునాది వేస్తుంది" అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.
నేటి తరం యువతీ యువకులు వివాహ బంధంలోకి అడుగుపెట్టే ముందు.. భారతీయ సమాజంలో ఈ వ్యవస్థకు ఉన్న పవిత్రతను, బాధ్యతను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలని న్యాయమూర్తులు హితవు పలికారు. వివాహం అనేది కేవలం ఒక వాణిజ్య లావాదేవీ కాదని, ఇద్దరు వ్యక్తుల మధ్య గౌరవప్రదమైన, ఆరోగ్యకరమైన జీవితకాల బంధాన్ని నిర్మించే ఒక మహోన్నత ఘట్టమని కోర్టు వ్యాఖ్యానించింది.














Click it and Unblock the Notifications