థియేటర్ లీజు కోసం ‘దిల్’ రాజు, ఏషియన్ సునీల్ నారంగ్ దౌర్జన్యం, రౌడీయిజం
థియేటర్ల మాఫియా మరోసారి రెచ్చిపోయింది. నిజామాబాద్ లోని నటరాజ్ థియేటర్ లీజు తనకే ఇవ్వాలంటూ దిల్ రాజు వర్సెస్ వెంకటరమణారెడ్డి తన అనుచరులను పంపించి థియేటర్ యజమాని మదన్ మోహన్ ను భయబ్రాంతులకు గురిచేశారు. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. పది రోజుల నుంచి ప్రతిరోజు దిల్ రాజు మనుషులు నటరాజ్ థియేటర్ కు రావడం, ఆఫీసులో కూర్చోవడం, లీజు అగ్రిమెంట్ పై సంతకం పెడతారా? లేదా? అంటూ బెదిరించడం.. ఇదే తంతు. దీనికి కారణం ఏమిటంటే అతను మైత్రీ మూవీస్ వారితో ఒప్పందం చేసుకున్నారు.
సొంత టౌన్ లోనే తీవ్ర వ్యతిరేకత
రోజురోజుకు మైత్రీమూవీస్ బలపడుతూ, తన ఆధిపత్యాని తగ్గిస్తోందని భావించిన దిల్ రాజు చివరకు ఒక థియేటర్ లీజు కోసం ఏం చేయడానికైనా వెనకాడని స్థితికి చేరారు. తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు.. ఇలా అందరి సమస్యలు తీర్చాల్సిన వెంకటరమణారెడ్డి చివరకు ఈ స్థాయికి దిగజారిపోయారు. ఇదెక్కడో జరిగింది కాదు.. అతని సొంత టౌన్ నిజామాబాద్ లోనే జరిగింది. అక్కడి థియేటర్ల యాజమాన్యమే దిల్ రాజుకు థియేటర్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారంటే అతనిపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాలను మరింతగా తెలుసుకుందాం.

మైత్రీకి ఇచ్చారని గొడవ
నిజామాబాద్‌లోని నటరాజ్ థియేటర్ మదన్ మోహన్ మనవడైన మైనర్ విక్రాంత్ పేరు మీద ఉంది. ఆ పిల్లాడే ఈ థియేటర్‌కు చట్టబద్ధమైన యజమాని. గతంలో దీన్ని 10 సంవత్సరాలకు ఏషియన్ ముక్తా సంస్థ యజమాని సునీల్ నారంగ్ కు లీజుకిచ్చారు. అయితే అగ్రిమెంట్ గడువు పూర్తికాకముందే ఏషియన్ సంస్థ వారే స్వచ్ఛందంగా లీజ్‌ను రద్దు చేసుకుంటున్నట్లు అధికారికంగా లేఖ రాసిచ్చారు. థియేటర్‌లోని తమ వస్తువులను కూడా తీసుకొని వెళ్లిపోయారు. ఏషియన్ సంస్థ ఖాళీ చేసి వెళ్ళిపోవడంతో, థియేటర్ యాజమాన్యం ఖాళీగా ఉన్న తమ థియేటర్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు లీజ్‌కు ఇస్తూ కొత్త అగ్రిమెంట్ చేసుకుంది.
బెదిరింపులకు దిగిన దిల్ రాజు మనుషులు
ఎప్పుడైతే మదన్ మోహన్ మైత్రీ మూవీస్ తో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిసిందో, వెంటనే ఏషియన్ సంస్థ ప్రతినిధులు వచ్చి తమకు మళ్లీ థియేటర్ కావాలని ఒత్తిడి తెచ్చారు. మే 28న మదన్ మోహన్ స్వయంగా ఏషియన్ అధినేత సునీల్‌ను కలిసి మైత్రీకే ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహంతో మీరు వారికి ఇవ్వడానికి వీల్లేదు, ఇస్తే ఎలా నడుపుతారో చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. సునీల్‌తో మాట్లాడి మదన్ మోహన్ తిరిగి థియేటర్‌కు తిరిగివచ్చేలోపే సునీల్ నారంగ్ దిల్ రాజుకు ఫోన్ చేశాడు. వెంకటరమణారెడ్డికి చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ మనుషులు నటరాజ్ థియేటర్ ఆఫీసులోకి జొరబడి గొడవకు దిగారు. థియేటర్‌ను దౌర్జన్యంగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ అక్కడి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. వారితోపాటు ఉన్న మైత్రీ మూవీస్ సిబ్బందిని కూడా బెదిరించారు.
రౌడీయిజానికి పాల్పడిన దిల్ రాజు
నిర్మాతలు, థియేటర్ల సమస్యలు పరిష్కరించడానికి వేసిన కమిటీలో సభ్యుడిగా ఉన్న దిల్ రాజే ఇలా రౌడీయిజానికి, అరాచకానికి పాల్పడటం చూస్తుంటే అతను మిగతావారికి ఎటువంటి న్యాయం కావాలనే చేయడు అని స్పష్టంగా అర్థమవుతోంది. మైత్రీమూవీస్ తాను లీజుకు తీసుకున్న థియేటర్లలో అద్భుతమైన సౌకర్యాలు కల్పిస్తూ, ప్రపంచస్థాయి టెక్నాలజీని వాడుతూ వాటిని కొత్త తరహా థియేటర్లలా తీర్చిదిద్తుతోంది. కానీ దిల్ రాజు, సునీల్ నారంగ్, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబులాంటివారు లీజుకు తీసుకున్న థియేటర్లలో మీరు కనీసం కాలు కూడా పెట్టలేరు. వెళ్లినా ముక్కుమూసుకొని మూడు గంటల ఉండలేక వెంటనే తిరిగొచ్చేస్తారు.
తాము లీజుకు తీసుకున్న థియేటర్లకు సౌకర్యాలు కల్పించకపోతే తమ సొంత మల్టీప్లెక్స్ లకే ప్రజలు వస్తారు కదా, అక్కడ భారీ రేట్లతో జనాలను దోచుకోవచ్చు అనే ఆలోచనతో ఈ మాఫియా ఇలా వ్యవహరిస్తోంది. సింగిల్ థియేటర్లను మైత్రీ మూవీస్ చేస్తున్నట్లుగా వీరు చేయకపోవడానికి ఇదే కారణం. నిజామాబాద్ నటరాజ్ థియేటర్ వివాదం టాలీవుడ్‌లో 'పెద్దల' అసలు రంగును బయటపెట్టగా, మరి ఈ దిల్ రాజు అరాచకానికి ఇండస్ట్రీ ఎలా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications