హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయడంపై తెలంగాణేతర కాంగ్రెసు శాసనసభ్యుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ అధిష్టానం నిర్ణయం వారికి కక్కలేని మింగలేని పరిస్థితిని కల్పించింది. రాయలసీమ, ఆంద్ర శాసనసభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం చేసిన ప్రకటన తీవ్ర బాధాకరమని కాంగ్రెసు శాసనసభ్యుడు శైలజానాథ్ అన్నారు. రాష్ట్ర విభజన ఆషామాషీ వ్యవహారం కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. భూ, జల వనరులు తదితర అంశాలపై చర్చోపచర్చలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎన్నో త్యాగాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని, దాన్ని విడగొట్టడం బాధాకరమని ఆయన అన్నారు.
సమైక్యాంధ్రనే తమకు సమ్మతమని, అయితే పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టబడి ఉంటామని శాసనసభ్యుడు జోగీ రమేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై రాయలసీమకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు ఎరాసు ప్రతాపరెడ్డి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమను సంప్రదించకుండా తెలంగాణ ప్రకటన ఎలా చేస్తారని ఆయన అడిగారు. తమకు ప్రత్యేకంగా గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని రాయలసీమ శాసనసభ్యులు డిమాండ్ చేశారు.