హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో తాము అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం పార్టీ సీనియర్ నాయకులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రభుత్వం శాసనసభలో తీర్మానం ప్రతిపాదిస్తే అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన మంతనాలు జరిపారు. అయితే గురువారం ఉదయం ఆ చర్చలు కొలిక్కి రాకపోవడంతో మళ్లీ మధ్యాహ్నం సమావేశం కావాలని నిర్ణయించారు.
కేంద్రం ప్రకటనను శుభపరిణామంగా తెలుగుదేశం సీనియర్ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. అన్నదమ్ముల్లా ఆంధ్ర, తెలంగాణ ప్రజలం విడిపోదామని ఆయన అన్నారు. అయితే తెలుగుదేశం మరో సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి కేంద్ర ప్రభుత్వంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రక్రియ ప్రారంభిస్తుందా, లేదా అనే విషయంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తమ పార్టీ వ్యహాన్ని మధ్యాహ్నం ఖరారు చేసుకుంటామని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.