హైదరాబాద్: కాంగ్రెసు శాసనసభ్యుల రాజీనామాల విషయం తనకు తెలియదని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. రాజీనామాల పర్వాన్ని పట్టించుకోకుండా ఆయన గురువారం శాసన మండలి సమావేశాలకు హాజరయ్యారు. శాసనసభ్యుల రాజీనామాల గురించి తనకు ఎవరూ చెప్పలేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు చెందిన ఆంధ్రా, రాయలసీమ శాసనసభ్యులు వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణపై ఏ విధంగా తీర్మానం చేయాలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం నుంచి ఏ విధమైన అధికారిక సమాచారం లేదని, తీర్మానంపై తనకు అధికారిక సమాచారం అందలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం విషయంలో తన ప్రమేయం లేదని, కాంగ్రెసు పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.