హైదరాబాద్: విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర విశ్వవిద్యాలయం (ఎస్కేయూ)లో విద్యార్థులపై లాఠీచార్జీని నిరసిస్తూ తెలుగుదేశం శాసనసభ్యులు తొలుత శాసనసభలోని స్పీకర్ ఛేంబర్ వద్ద బైఠాయించారు. అక్కడ ఆందోళన సాగిస్తున్న వారిని ముఖ్యమంత్రి కె. రోశయ్య చర్చలకు ఆహ్వానించారు. వారు రోశయ్యతో మాట్లాడిన తర్వాత తెలుగుదేశం శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎస్కేయూలోని విద్యార్థులపై దౌర్జనం చేస్తున్న చారు సిన్హా ఇతర పోలీసు అధికారులను వెనక్కి పిలిపించాలని తాము డిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు. అందుకు రోశయ్య అగీకరించారని ఆయన అన్నారు.
పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, తెలంగాణలో ఉద్యమించిన విద్యార్థులపై ఒక రకంగా తెలంగాణేతర ప్రాంతాల్లో విద్యార్థులపై మరో రకంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. పోలీసులు తమ పక్షపాత వైఖరిని మానుకోకపోతే అందుకు మూల్యం ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందని ఆయన అన్నారు. పోలీసులు విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఉద్యమాన్ని లాఠీల ద్వారా ఆపాలనుకుంటే సాధ్యం కాదని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రతినిధి బృందంలో పయ్యావుల కేశవ్ తదితరులున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి