సీమాంధ్ర ఎంపీలకు హై కమాండ్ షాక్

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట మార్చిన తీరును ఎండగట్టడానికి బదులు ఆయనతో తమ పార్టీ సీమాంధ్ర నేతలు గొంతు కలపడాన్ని అధిష్టానం సహించే స్థితిలో లేదు. మరో వైపు తెలంగాణ మంత్రులు వారి ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తూ వచ్చారు. పార్టీలోనే రెండు గ్రూపులు ఏర్పడి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇస్తున్నారనే అభిప్రాయం అధిష్టానంలో నాటుకుపోయింది. దీంతో ఎంపీల తీరుకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీ వంటి అధిష్టానం నేతలు వారికి అపాయింట్ మెంటు ఇవ్వకూడదని నిర్ణయించుకుని అదే విషయాన్ని రాష్ట్ర ఎంపీలకు చెప్పారు. ఎవరికీ అపాయింట్ మెంట్లు ఉండవని తెగేసి చెప్పారు.
సమైక్యాంధ్రకు అనుకూలంగా అధిష్టానం ఒత్తిడి తెచ్చేందుకు కోస్తాంధ్ర, రాయలసీమ శాసనసభ్యులు గురువారం ఢిల్లీకి బయలుదేరారు. అధిష్టానం అపాయింట్ మెంటు తీసుకోవాలని వీరు ఎంపిలను కోరారు. అయితే అధిష్టానం తాజా నిర్ణయంతో ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది. సీమాంధ్ర నేతల లాబీయింగ్ కు, ఒత్తిళ్లకు తలొగ్గకూడదనే ఉద్దేశంతోనే అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్షాల మాటను నమ్మి తాము నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు ఆ పార్టీలు మోసం చేశాయని ప్రధాని మన్మోహన్ సింగ్ లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ వద్ద అన్నట్లు సమాచారం. సాంత్వన కోసమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూనుకున్నామని ప్రధాని మన్మోహన్ చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద, తెలంగాణకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్న అధిష్టానం సీమాంధ్ర నేతల ఒత్తిళ్లకు తలొగ్గడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. కాగా, గురువారం సాయంత్రం ప్రధాని విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. దీంతో ఏ విధమైన సీమాంధ్ర ప్రయత్నాలు కూడా సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications