హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం టీడీపీ ఎమ్మెల్యేలపై దాడి చేసిన విద్యార్థులపై కేసు నమోదు చేశామని ఐజీ అనురాధ తెలిపారు. టీడీపీ నేతలను అక్కడి నుంచి తరలించింది పోలీసులేనని ఆమె చెప్పారు.బయటవాళ్లెవరూ ఓయూలోకి వెళ్లవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. పర్యవసానాలు తెలియకుండా విద్యార్థులు హింసకు పాల్పడుతున్నారని సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ఎమ్మెల్యేలపై దాడిని నివారించడంలో పోలీసులు విఫలమయ్యారన్న ఆరోపణను ఆమె తోసిపుచ్చారు.
బంద్ సందర్భంగా హైదరాబాద్ సహా తెలంగాణ ప్రాంతాల్లో పలుచోట్ల ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించారని ఆమె తెలిపారు. దీనికి సంబంధించి 436 మందిని అరెస్టు చేసినట్టు ఐజీ చెప్పారు.