కెసిఆర్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా

గ్రామ పంచాయతీ స్థాయి నుంచి వివిధ స్థాయిల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాలు చేశారు. చిదంబరం ప్రకటన వెలువడగానే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మాజీ హోం మంత్రి కె. జానారెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులతో చర్చించి సంయుక్త ప్రకటన చేశారు. విధ్వంసానికి దిగవద్దని జానారెడ్డితో కలిసి కెసిఆర్ పిలుపునిచ్చారు. తాము కూడా రాజీనామాలు చేస్తామని కెసిఆర్ చెప్పారు. భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడానికి అన్ని పార్టీలకు చెందిన నాయకులు గురువారం మధ్యాహ్నం 11 గంటలకు సమావేశమవుతున్నారు. అలాగే, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ఒంటి గంటకు సమావేశమవుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కోల్డ్ స్టోరేజీలో పెట్టడమేనని కెసిఆర్ విమర్శించారు. నోటి కాడి కూడును కేంద్ర ప్రభుత్వం లాగేసుకుందని ఆయన విమర్శించారు. తెలంగాణలో 144, 30 సెక్షన్లు విధించి అణచివేత చర్యలకు దిగుతున్న ప్రభుత్వం రాయలసీమ, కోస్తాంధ్రల్లో అన్ని రకాల ఆందోళనలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని ఆయన విమర్శించారు. పోలీసులతో తెలంగాణ ప్రజలను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వ చర్యలు ప్రాంతీయంగా అసమానతను పాటించడం లేదని ప్రభుత్వం అడుగడుగునా రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉందని జానా రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications