మళ్లీ వచ్చేసిన పోసాని..ఈసారి టార్గెట్ వాళ్లే..!
ప్రముఖ నటుడు, రచయిత, దర్శక నిర్మాత పోసాని కృష్ణమురళి సుదీర్ఘ విరామం తర్వాత మెగాఫోన్ పట్టారు. పోసాని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా "ఆపరేషన్ అరుణారెడ్డి". కేవలం దర్శకత్వమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ ఇలా అన్ని బాధ్యతలను పోసాని స్వయంగా భుజానికెత్తుకోవడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో చిత్ర బృందం పంచుకుంది.
జర్నలిజం నేపథ్యంతో సాగే సామాజిక కథ
జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సమాజం బాగుంటుంది అనే బలమైన పాయింట్‌తో ఈ సినిమాను రూపొందించినట్లు పోసాని వెల్లడించారు. ఇందులో హిందోళ చక్రవర్తి అరుణారెడ్డి అనే పవర్ ఫుల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తున్నారు. రాజకీయాల్లోకి ప్రజల కోసం ఎవరు వచ్చారు? వ్యాపారం కోసం ఎవరు వచ్చారు? అనే విషయాలపై ప్రజలను అప్రమత్తం చేసే పాత్ర ఆమెది. ఒక సిన్సియర్ జర్నలిస్టుకు రాజకీయాల వల్ల ఆపద వస్తే.. ఒక మంచి ముఖ్యమంత్రి ఆమెకు ఎలా అండగా నిలబడ్డారు అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

సీఎం పాత్రలో రఘునందన్ రావు.. పొలిటికల్ కాంట్రవర్సీ లేదు
ఈ చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రను బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పోషించారు. రఘునందన్ రావుపై ఉన్న గౌరవంతో తాను ఈ పాత్రను ఆయనే చేయాలని కోరానని.. ఆయన కూడా కథ విని వెంటనే అంగీకరించారని పోసాని తెలిపారు. అయితే ఈ సినిమాకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం సమాజ హితం కోరేలా, ఎటువంటి బూతులు లేదా అసభ్యత లేకుండా వంద శాతం సిన్సియర్ సినిమాగా దీనిని తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నారు.
కెరీర్ బెస్ట్ స్క్రీన్ ప్లే.. అందరికీ నచ్చే సినిమా
తన కెరీర్‌లో 100 సినిమాలకు కథలు అందించిన అనుభవం ఉన్నప్పటికీ.. "ఆపరేషన్ అరుణారెడ్డి" స్క్రీన్ ప్లే దేశంలోనే అత్యుత్తమంగా ఉంటుందని పోసాని కృష్ణమురళి ధీమా వ్యక్తం చేశారు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రేక్షకులు కథను ఊహించలేరని.. ఇది అన్ని వర్గాల ప్రజలకు, పార్టీల అభిమానులకు నచ్చుతుందని చెప్పారు. తనకు ఎడిటింగ్ అంటే ఇష్టమని, అందుకే ఈ చిత్రానికి ఎడిటర్‌గా కూడా బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపారు. తన గత రాజకీయ ప్రస్థానం గురించి చెబుతూ.. తాను ఎవరి దగ్గర ఏ పదవులు ఆశించలేదని, కేవలం నంది అవార్డుల నిర్వహణ కోసమే ఎఫ్‌డీసీ ఛైర్మన్ పదవిని తీసుకున్నానని క్లారిటీ ఇచ్చారు.
అవిశ్రాంతంగా పోసాని దగ్గర నేర్చుకున్నా: హీరోయిన్ హిందోళ
హీరోయిన్ హిందోళ చక్రవర్తి మాట్లాడుతూ.. పోసాని వంటి సీనియర్ దగ్గర పనిచేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. అరుణారెడ్డి పాత్రలో నటించడం వల్ల నటనతో పాటు క్రమశిక్షణ, సినిమా పట్ల అంకితభావం నేర్చుకున్నానని చెప్పారు. అరుణ అనే పాత్ర ఎంతో ఎమోషనల్, సెన్సిటివ్ అని.. అలాంటి పవర్ ఫుల్ పాత్రను మలిచిన తీరు అద్భుతమని ఆమె కొనియాడారు. తెలుగు డైలాగ్స్ చెప్పడంలో పోసాని ఎంతో ఓపికగా తనకు శిక్షణ ఇచ్చారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు.













Click it and Unblock the Notifications