తప్పు నాదే, ఆ పాత్రకు నేను సెట్ కాను: సాయి పల్లవి క్లారిటీ!
లేడీ సూపర్ స్టార్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించిన తాజా హిందీ చిత్రం 'ఏక్ దిన్'బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో తన పాత్రపై, సినిమా ఫలితంపై సాయి పల్లవి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.సాధారణంగా ఏ నటుడైనా తన సినిమా పరాజయం పాలైతే కథనో, దర్శకత్వాన్నో నిరసిస్తారు. కానీ సాయి పల్లవి తన నిజాయితీని చాటుకుంటూ, ఆ పాత్రకు తాను సరైన ఎంపికను కాదని కుండబద్ధలు కొట్టారు. ఆమిర్ ఖాన్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రంలో తాను 'మిస్‌కాస్ట్' అయ్యానని, తనకంటే మరింత ఉత్సాహం, చురుకుదనం ఉన్న నటి ఎవరైనా ఉంటే ఆ పాత్రకు పూర్తి న్యాయం జరిగేదని సాయిపల్లవి అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని సినిమా ప్రీమియర్ చూసిన వెంటనే ఆమిర్ ఖాన్‌కు కూడా తెలియజేసినట్లు ఆమె పేర్కొనడం గమనార్హం.
హిందీ భాషా సమస్య.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
ఈ సినిమా ప్రమోషన్ల కోసం ముంబై వెళ్లిన సమయంలో సాయిపల్లవి హిందీలో మాట్లాడటానికి ఇబ్బంది పడ్డారు. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్‌కు దిగారు. కనీసం హిందీ సరిగ్గా మాట్లాడలేని ఆమె.. నితేష్ తివారీ ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణం'లో సీత పాత్రను ఎలా పోషిస్తుందని విమర్శలు గుప్పించారు. ఈ నెగిటివ్ కామెంట్స్ ఆమెను కొంత అసౌకర్యానికి గురిచేసినప్పటికీ.. తన నటనపై తనకు ఉన్న నమ్మకంతో ఆమె ముందుకు సాగుతున్నారు.

తేలికపాటి కథ కోసం చేసిన ప్రయత్నం
సాయి పల్లవి గతంలో చేసిన పాత్రలన్నీ చాలా కష్టమైనవి, భావోద్వేగాలతో కూడినవి. అందుకే ఈసారి కాస్త విభిన్నంగా, తేలికపాటి ప్రేమకథా చిత్రంలో నటించాలని సాయిపల్లవి భావించారు. హాలీవుడ్ క్లాసిక్ చిత్రం 'బిఫోర్ సన్‌రైజ్' తరహాలో ఈ సినిమా ఉంటుందనే ఉద్దేశంతో సాయిపల్లవి ఈ ప్రాజెక్ట్‌ను ఒప్పుకున్నారు. అయితే తన కో-స్టార్ జునైద్ ఖాన్ మాత్రం సాయి పల్లవి ఈ పాత్రకు వంద శాతం సరిపోయారని.. ఆమె నటన సినిమాకు ప్లస్ అయ్యిందని ఆమెను సమర్థించారు.
రూ. 10 కోట్లు కూడా దాటని వసూళ్లు.. భారీ పరాభవం
థాయ్ చిత్రం 'వన్ డే'కు అధికారిక రీమేక్‌గా వచ్చిన 'ఏక్ దిన్' బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బతింది. విమర్శకులు సాయి పల్లవి నటనను ప్రశంసించినప్పటికీ.. పేలవమైన స్క్రీన్ ప్లే, కథనం వల్ల ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేదు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా తన పూర్తి రన్‌లో కనీసం రూ. 10 కోట్ల మార్కును కూడా అందుకోలేకపోయింది. ఆమిర్ ఖాన్ వంటి పెద్ద బ్యానర్‌లో వచ్చిన సినిమా ఇలా డిజాస్టర్ కావడం అటు జునైద్ ఖాన్ కెరీర్‌కు, ఇటు సాయి పల్లవికి పెద్ద దెబ్బగానే భావించవచ్చు.












Click it and Unblock the Notifications