వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర ఆహ్వానంతో చిక్కుల్లో చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణపై చర్చలకు రాజకీయ పార్టీలను కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి ఆహ్వానించడం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఇరకాటంలో పెట్టింది. రెండు వాదాలకు కొమ్ము కాస్తూ కాంగ్రెసు పార్టీని ఇరకాటంలో పెట్టాలని వ్యూహరచన చేసి అమలులో పెట్టిన చంద్రబాబు తానే స్వయంగా ఇరకాటంలో పడ్డారు. ఒక వైపు సమైక్యవాదాన్ని, మరో వైపు తెలంగాణవాదాన్ని ఏక కాలంలో వినిపిస్తూ అందుకు తన పార్టీ నాయకులను ప్రాంతాలవారీగా ఉద్యమింపజేస్తూ కాంగ్రెసును ఇబ్బందుల్లో పడేయాలని ఆయన భావించారు. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, శాసనసభలో తీర్మానం ప్రతిపాదిస్తే బలపరుస్తామని పదే పదే చెబుతూ వచ్చిన చంద్రబాబు కీలకమైన సమయంలో సమైక్యాంధ్ర నినాదంతో కోస్తాంధ్ర, రాయలసీమ నేతలను ఉద్యమింపజేశారు. తద్వారా తన తెలంగాణ నిర్ణయానికి గండి కొట్టుకున్నారు. కేంద్ర మంత్రి చిదంబరం రెండో ప్రకటన వెలువడిన తర్వాత తెలంగాణలో ఉద్యమం ప్రారంభం కావడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. తమ పార్టీ తెలంగాణ నాయకులు అనివార్యంగా తెలంగాణ గొంతు వినిపించాల్సిన అగత్యంలో పడ్డారు. తెలంగాణ తెలుగుదేశం నాయకులు కూడా విద్యార్థులు ఒత్తిడి కోసమే కాకుండా తమ రాజకీయ భవిష్యత్తు కోసం కూడా మిగతా రాజకీయ పార్టీలతో కలిసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించాల్సిన పరిస్థితిలో పడ్డారు. తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేస్తే తాము చంద్రబాబును వదులుకుంటామని కడియం శ్రీహరి లాంటి తెలుగుదేశం నాయకులు అనాల్సి వచ్చింది.

కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా రాష్ట్రానికి చెందిన ఎనిమిది రాజకీయ పార్టీలను చర్చలకు ఆహ్వానించడంతో తెలుగుదేశం పార్టీ రెండు నాలుకలతో మాట్లాడాల్సిన స్థితి నుంచి బయటపడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో చంద్రబాబు అటో ఇటో తేల్చుకోక తప్పని స్థితిని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. జనవరి 5వ తేదీన తెలుగుదేశం పార్టీ తన వైఖరిని కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి సమైక్యాంధ్రకు కట్టుబడ్డారు. దాని వల్ల ఆయనకు ఇబ్బంది లేదు. తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నానని చెప్పడానికి అవకాశం ఉంది. అయితే అందుకు తగిన కారణాలను ఆయన ఎలా వివరిస్తారనేది పెద్ద ప్రశ్నార్థకం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వాదనను బలంగా పెట్టడానికి అనేక కారణాలున్నాయి. కానీ సమైక్యాంధ్రను సమర్థిస్తూ కారణాలు చూపడానికి భాష తప్ప మరోటి లేదు. కాకపోతే హైదరాబాద్ గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ హైదరాబాద్ పై ఇప్పుడే మాట్లాడే స్థితి ఉండకపోవచ్చు.

ఇబ్బంది అంతా చంద్రబాబుకే వచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగే చర్చలకు చంద్రబాబు వెళ్లకపోవచ్చునని అంటున్నారు. తెలంగాణకు చెందిన నామా నాగేశ్వరరావు, నాగం జనార్దన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, కడియం శ్రీహరి, మోత్కుపల్లి నర్సింహులు, రేవంత్ రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి, మహేందర్ రెడ్డిలను ఢిల్లీకి పంపే అవకాశాలున్నాయి. అయితే ఈలోగా పార్టీ పోలిట్ బ్యూరో సమావేశాన్ని, కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు చర్చలు జరపనున్నారు. ప్రాంతీయ పార్టీలను చీల్చడానికే కేంద్ర ఈ నిర్ణయం తీసుకుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రంనాయుడు అన్నారు. దీన్ని బట్టి ప్రాంతాలవారీగా విడిపోయిన తెలుగుదేశం పార్టీకి కష్టకాలమే. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. ఏ నిర్ణయం తీసుకోబోయినా పార్టీ చీలే ప్రమాదం ఉండవచ్చు. అదే సమయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యతను కేంద్రం కల్పించింది. ఈ వాతావరణంలో చంద్రబాబు తల పట్టుకుని కూర్చోవాల్సిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X