విడిపోతే పంటలకు నీరు ఉండదు: దేవినేని ఉమా

2009 ఎన్నికల్లో సమైక్యవాదంతో ముందుకెళ్లిన వైఎస్‌ఆర్‌కే ప్రజలు పట్టం కట్టారని, టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకొని తాము విఫలమయ్యామని దేవినేని అంగీకరించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కనీసం ఒక్క డివిజన్‌లో కూడా పోటీ చేసే దమ్ములేక కేసీఆర్ పరారయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన విషయంలో బీజేపీ ద్వంద్వవైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. హైదరాబాద్‌లోని ఆంధ్రులపై ఏబీవీపీ కార్యకర్తలతో రాళ్లు రువ్వించి, ఇక్కడ జైఆంధ్ర అని నినాదించడం విడ్డూరంగా ఉందన్నారు.
తెలంగాణ విడిపోతే కృష్ణా, గోదావరి నుంచి ఒక్క చుక్కనీరు కూడా ఆంధ్రకు విడుదల చేయరని, దీంతో ఈ ప్రాంతం ఎడారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ జేఏసీ బ్లాక్‌మెయిల్‌కు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం మరో మారు ప్రకటన చేస్తే తర్వాత జరిగే ఎటువంటి పరిణామాలకైనా కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చలసాని ఆంజనేయులు, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు కె.జగన్మోహనరావు, చెన్నుబోయిన శివయ్య, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వేగిరెడ్డి పాపారావు, తెలుగు రైతు నాయకులు జీ ఉమావరప్రసాద్, బొబ్బా వీరరాఘవరావు, బీ రాజేశ్వరరావు పాల్గొన్నారు.