హైదరాబాద్: రాజీనామాలను ఉపసంహరించుకోవాలని తెలంగాణ మంత్రులు నిర్ణయించుకున్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో సమావేశమైన అనంతరం తెలంగాణ మంత్రులు ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. సమావేశం వివరాలను సమాచార, పౌర సంబంధాల మంత్రి జె. గీతారెడ్డి మీడియా ప్రతినిధులకు తెలిపారు. శ్రీనివాస్ ఇచ్చిన సలహా మేరకు తాము రాజీనామాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై జనవరి 5వ తేదీన రాజకీయ పార్టీలను చర్చలకు ఆహ్వానించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తమకు సంతృప్తిని కలిగించిందని కూడా ఆమె చెప్పారు.
చర్చలతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తోందని, అందుకు తాము కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి సహకరించాల్సి ఉంటుందని, అందుకే తాము రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నామని ఆమె వివరించారు. కేంద్ర నిర్ణయం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్ కు, కాంగ్రెసు కోర్ కమిటీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి తెలంగాణ మంత్రులు నిరాకరించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి