హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్యకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై ఐటి శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీసు తీవ్ర గందరగోళానికి దారి తీసింది. రోశయ్య ఆంధ్ర ప్రాంతం పట్ల పక్షపాత వైఖరి అవంబిస్తున్నారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో కోమటిరెడ్డికి కాంగ్రెసు అధిష్టానం శుక్రవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. మంత్రి పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకోకపోవడంపై కూడా పార్టీ అధిష్టానం కోమటిరెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ముఖ్యమంత్రి రోశయ్య అధిష్టానానికి ఫిర్యాదు చేయడం, అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసు ఇవ్వడం పార్టీలో ప్రాంతాలవారీ చిచ్చును మరింత పెంచింది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాజ్ నోటీసు ఇవ్వడంపై మాజీ మంత్రులు, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యులు కె. జానారెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పదవిని తృణప్రాయంగా ఎంచిన కోమటిరెడ్డిని మిగతా తెలంగాణ మంత్రులు ఆదర్శంగా తీసుకోవాలని శుక్రవారం అన్నారు. కోమటిరెడ్డిపై చర్యలు తీసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని వారన్నారు. కేంద్రం చెప్పినట్లు రోశయ్య శాసనసభలో తెలంగాణ తీర్మానం పెట్టి ఉంటే సమస్య ఇంత దాకా వచ్చి ఉండేది కాదని వారు అన్నారు. మొత్తం వ్యవహారంలో రోశయ్య పొరపాటు లేదా అని వారడిగారు. లగడపాటి రాజగోపాల్ వంటి ఆంధ్ర నాయకులకు ఒక నీతి, కోమటిరెడ్డి వంటి తెలంగాణ నాయకులు మరో నీతి కాంగ్రెసు అమలవుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి