న్యూఢిల్లీ: అంధ్రప్రదేశ్ కు చెందిన ఇరు ప్రాంతాల నేతలు తమ తమ ప్రయత్నాలు చేస్తూ ఇంకా ఢిల్లీలో లాబీయింగ్ చేస్తూనే ఉన్నారు. కేంద్ర హోం మంత్రి పి. చిదంబరంతో వారు విడివిడిగా భేటీ అయ్యారు. నాలుగు గ్రూపులు గురువారం చిదంబరంతో సమావేమయ్యాయి. తొలుత తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర మంత్రులు, నేతలు చిదంబరంతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్దిష్ట కాలపరిమితి విధిస్తూ ప్రకటన చేయాలని వారు చిదంబరాన్ని కోరారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితేనే మంచిదని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ రోడ్ మ్యాప్ నకు కమిటీ వేసి కాలపరిమితిని విధించినా ఫరవా లేదని వారన్నారు. తెలంగాణ ఇస్తే ఐఎస్ఐ, నక్సల్స్ అడ్గాగా మారుతుందనే సీమాంధ్ర నేతల వాదనలను వారు కొట్టి పారేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి చేసే చివరి ప్రయత్నంలో భాగంగా సీమాంధ్ర నేతలు ఆ వ్యాఖ్యలు చేస్తున్నారని వారు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర, ఇతర ప్రాంతాలున్నాయని, తెలంగాణ అందులో లేదని వారు చెప్పారు.
కాగా, చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీకి చెందిన తెలంగాణ శాసనసభ్యుడు మహేశ్వర రెడ్డి కూడా చిదంబరాన్ని కలిశారు. చిరంజీవి వైఖరిని ఆయన వ్యతిరేకించారు. సమైక్యాంధ్ర వైఖరి చిరంజీవి వ్యక్తిగతమే కాని పార్టీ అభిప్రాయం కాదని ఆయన చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా చిరంజీవి ప్రకటనలు చేసిన వైనాన్ని, ఎన్నికల ప్రణాళికలో పెట్టిన విషయాన్ని ఆయన చిదంబరానికి వివరించారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు కూడా చిదంబరాన్ని కలిశారు. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా వారు తమ వాదనలు వినిపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే నక్సల్స్ ప్రాబల్యం పెరుగుతుందనే కొత్త వాదనను ముందుకు తెచ్చి వారు మాట్లాడారు. హైదరాబాద్ ఐఎస్ఐ అడ్డాగా మారుతుందని కూడా వారు చెప్పారు. కాగా, మజ్లీస్ సోదరులు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ కూడా చిదంబరంతో భేటీ అయ్యారు. రాష్టంలో రాష్ట్రపతి పాలన విధించాలని వారు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి