హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ నాయకత్వంలోనే తాను రాజకీయాల్లో పని చేస్తానని, హత్య కేసు నుంచి విడుదలయ్యాక తాను రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసు నిందితుడు మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి అన్నారు. ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. వైయస్ రాజశేఖర రెడ్డి లేని లోటు తీర్చాల్సింది జగనే అని, జగన్ తమ నాయకుడని ఆయన అన్నారు. పరిటాల రవి హత్యతో తనకు గానీ మొద్దు శీనుకు గానీ ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు. శీను మొదట తనకు పరిచయమైంది పరిటాల రవి హత్య కేసులో నిందితుడిగా వచ్చినప్పుడేనని ఆయన అన్నారు. మొద్దు శీను హత్యతో తనకు ఏ విధమైన సంబంధం లేదని, తమ ఇద్దరి మధ్య ఏ విధమైన శత్రుత్వం లేదని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే తనను పరిటాల రవి హత్య కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు. జైలు జీవితం పగవాడికి కూడా వద్దని ఆయన అన్నారు. తాను నిర్దోషిగా విడుదలవుతాననే నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఇప్పటికే తాను 13 ఏళ్ల జైలు శిక్ష అనుభవించానని, ప్రభుత్వం తనకు క్షమాభిక్ష ప్రసాదించడం న్యాయమేనని ఆయన అన్నారు. తనకు పరిటాల రవికి మధ్య ఫ్యాక్షన్ గొడవలు లేవని, రాజకీయ విభేదాలు మాత్రమే ఉండేవని ఆయన అన్నారు. తన కుమారుడికి తాను జైల్లో ఉన్నట్లు తెలియదని, తన కుమారుడి భవిష్యత్తు తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. తనకూ తన భార్యకూ మధ్య స్పర్థలు లేవని ఆయన స్పష్టం చేశారు. తాను జైల్లో సెల్ ఫోన్ వాడినట్లు వచ్చిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన అన్నారు. జైలులో ఉండి సెటిల్ మెంట్లు చేసినట్లు వచ్చిన ఆరోపణలు కేవలం కల్పితమని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి