హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసి) మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్పీ యాదవ్ పై ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఏక పక్షంగా ఆర్టీసి చార్జీలు పెంచడమే కాకుండా ముఖ్యమంత్రి కె.రోశయ్యపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆర్టీసి చార్జీలను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసి) యాజమాన్యం భారీగా పెంచింది. ఆర్టీసి చార్జీలు పెంచిన విషయమై తనకు తెలియదని, ఆర్టీసి యాజమాన్యం ఏకపక్షంగా పెంచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు చెప్పారు. ఆయన గురువారం ముఖ్యమంత్రి కె.రోశయ్యను కలిశారు. ముఖ్యమంత్రిపై యాదవ్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఆయన అన్నారు.
ఆర్టీసి చార్జీల పెంపు బాధాకరమని ఆయన అన్నారు. ఆర్టీసి చార్జీలు పెంచిన విషయమై తనకు తెలియదని, ప్రభుత్వానికి సమాచారం కూడా లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆర్టీసి చార్జీలను పెంచుతూ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో సమావేశమైన యాదవ్ ముఖ్యమంత్రి కె. రోశయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర రెడ్డితో పోల్చుకుంటే రోశయ్య మనిషేనా అని ఆయన విరుచుకుపడ్డారు. రోశయ్య రాజకీయ వేత్తనే కారని, అందుకే రాష్ట్ర పరిస్థితి ఇలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఇక్కడే ఉంటే తనను పిలిపిస్తారని, అందుకే ఆగ్రా వెళ్తున్నానని ఆయన చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి