న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర మంత్రివర్గం శనివారం చర్చించింది. అయితే తెలంగాణ రోడ్ మ్యాప్ పై ఒక నిర్ణయానికి రాలేకపోయింది. తెలంగాణపై మంత్రివర్గానికీ ఆర్థిక వ్యవహార క్యాబినెట్ కమిటీకీ మధ్య పది నిమిషాల పాటు చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాంగ్రెసులో తెలంగాణపై ఏకాభిప్రాయం కుదరకపోవడమే అసలు సమస్యగా తెలుస్తోంది. నిర్ణయానికి రావడానికి ముందు ఇంకా ఎంతో చర్చ జరగాల్సి ఉంటుందని విశ్వసనీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తెలంగాణపై శనివారం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోకపోవడానికి కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం లేకపోవడం కూడా ఒక కారణమని చెబుతున్నారు. చిదంబరం తమిళనాడు పర్యటనకు వెళ్లారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి