హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.రోశయ్యపై, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావుపై మాజీ మంత్రి, తమ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు ఆర్.దామోదర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ ఖండించారు. టీవీ చానెళ్లలో వచ్చిన వార్తల వెనక ముఖ్యమంత్రి కె.రోశయ్య, చిత్రగుప్తుడు కెవిపి రామచందర్ రావు పాత్ర ఉందని దామోదర్ రెడ్డి వ్యాఖ్యానించడం మంచిది కాదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. చాలా మంది ఆ చిత్రగుప్తుడి వద్ద కూర్చున్నవాళ్లేనని ఆయన అన్నారు. తాము రోశయ్య మంత్రి వర్గంలో పనిచేస్తున్నామని, రోశయ్యను అంటే తమందరినీ అన్నట్లేనని ఆయన అన్నారు. తెలంగాణ అంశాన్ని ముఖ్యమంత్రి కాంగ్రెసు పార్టీ అధిష్టానానికే వదిలేశారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డు రాదని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెసు అధిష్టానం సిద్ధంగా ఉన్న సమయంలో దామోదర్ రెడ్డి అలా మాట్లాడడం మంచిది కాదని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని కేంద్ర ప్రభుత్వం బావిస్తోందని, విద్యార్థుల చదవులు పాడవుతాయని బాధపడుతోందని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైయస్ రాజశేఖర రెడ్డికి అభిమానులున్నారని, అభిమానం ఉన్నప్పుడు ఆవేశం ఉంటుందని, దాన్ని వేరేవాళ్లకు అంటగట్టడం సరికాదని ఆయన అన్నారు. దాడులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి