హైదరాబాద్: టీవీ5 చానెల్ జర్నలిస్టుల అరెస్టును ఖండిస్తూ జర్నలిస్టులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు. ధర్నాలకు దిగారు. అరెస్టు చేసిన టీవీ5 ప్రతినిధులు బ్రహ్మానంద రెడ్డి, వెంకటకృష్ణలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (ఎపియుడబ్ల్యుజె) ఆధ్వర్యంలో హైదరాబాదులో ర్యాలీ జరిగింది. హైదరాబాదులోని బషీర్ బాగ్ నుంచి ఈ ర్యాలీ సాగింది.
ప్రెస్ అకాడమీ చైర్నన్ అమర్, ఐజెయు నాయకుడు కె. శ్రీనివాస్ రెడ్డి శనివారం ఉదయం ముఖ్యమంత్రి కె.రోశయ్యను కలిశారు. టీవీ5 జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసిన తీరుపై శ్రీనివాస్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. నేరస్థుల మాదిరిగా వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారని ఆయన విమర్శించారు. టీవీ చానెల్ ప్రసారం చేసిన వార్తాకథనం జోలికి తాను వెళ్లడం లేదని, జర్నలిస్టులను అరెస్టు చేసి తీరును మాత్రమే ప్రశ్నిస్తున్నానని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి