హైదరాబాద్: ది ఎగ్జైల్డ్ కథనం నేపథ్యంలో రాష్ట్రంలో తలెత్తిన పరిణామాల విషయంలో కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన సాక్షి దినపత్రిక మరోసారి ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీరావుపై, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై దుమ్మెత్తిపోసింది. ఈ మేరకు పతాక శీర్షికన వార్తాకథనాన్ని ప్రచురించింది. ది ఎగ్జెల్డ్ వైయస్ మరణంపై ఆ వార్తాకథనాన్ని ఎందుకు ప్రచురించిందనే విషయాన్ని ఆలోచించకుండా చంద్రబాబు భుజాలు తడుముకున్నారని ఆరోపించింది. చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి విషం కక్కారని ఆరోపించింది. చంద్రబాబుకు వత్తాసు పలికే రెండు దినపత్రికలు జగన్ పై ఆరోపణలు సంధించాయని వ్యాఖ్యానించింది. టీవీ చానెళ్లలో వచ్చిన కథనాలు జగన్ కుట్రేనని నిస్సిగ్గుగా చంద్రబాబు మాట్లాడారని ఆరోపించింది.
భావోద్వేగాల వేడిలో ఒక సంస్థ కార్యాలయాలపై జరిగిన దాడులను దాడులను వైయస్ జగన్ కూడా ఖండించారని రాసుకుంది. వైయస్ కుటుంబం పట్ల నరనరానా విద్వేషాన్ని నింపుకున్న ఆ రెండు పత్రికలు, చంద్రబాబు ఆ అంశాన్ని విస్మరించి నిరాధారమైన ఆరోపణలు చేసినట్లు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా వైయస్ జగన్ హస్తం ఉందంటూ దాడి చేయడం వెనక ఎల్లో మీడియా, తెలుగుదేశాధినేత కుట్ర ఉందనే విషయం మాత్రం మరోసారి సుస్పష్టమైందని రాసింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి