హైదరాబాద్: రాజీనామాలపై ఒత్తిడి పెరుగుతుండడంతో తెలంగాణ రాజకీయ సంయుక్త కార్యాచరణ సమితి (జెఎసి) నుంచి కాంగ్రెసు పార్టీ తప్పుకునే సూచనలు కనిపిస్తున్నాయి. గురువారం సాయంత్రం జరిగిన జెఎసి సమావేశానికి కాంగ్రెసు పార్టీ హాజరు కాలేదు. అయితే వేరే కార్యక్రమం వల్ల కాంగ్రెసు హాజరు కాలేదని జెఎసి కన్వీనర్ కోదండరామ్ అంటున్నారు. జెఎసి సమావేశానికి కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి ద్వారా ఒక లేఖను పంపింది. జెఎసికి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, ఇద్దరు కన్వీనర్లను పెట్టాలని కాంగ్రెసు విజ్ఞప్తి చేసింది. మొత్తం నాలుగు అంశాలతో ఆ లేఖ రాసింది. తమ పార్టీని ఇబ్బంది పెట్టేలా తమ శాసనసభ్యులను, ప్రజాప్రతినిధులను కొన్ని పార్టీలవారు లక్ష్యంగా పెట్టుకున్నారని కాంగ్రెసు మండిపడుతోంది.
కాంగ్రెసు పార్టీ విడిగా కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై విమర్సలు వస్తుండడంపై కూడా కాంగ్రెసు నాయకులు మనసు చిన్నబుచ్చుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే పూర్తిగా జెఎసి నుంచి కాంగ్రెసు బయటకు రావాలని నిర్ణయం తీసుకోలేదు. సొంతంగా ఉద్యమం చేపట్టాలని మాత్రం నిర్ణయించుకున్నట్లు సమాచారం. చిత్తశుద్ధితో ఉన్న తమ నాయకులను లక్ష్యంగా చేసుకోవడంపై కూడా కాంగ్రెసు నాయకులు తప్పు పడుతున్నారు. మొత్తం మీద కాంగ్రెసు పార్టీ తెలంగాణ నాయకులకు ముందుకు పోలేని, వెనక్కి రాలేని స్థితి నెలకొని ఉంది. విద్యార్థుల నుంచి ఒత్తిడిని తట్టుకోలేక, అధిష్టానం నుంచి తెలంగాణపై స్పష్టమైన ప్రకటన ఇప్పించలేక ఇబ్బంది పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి