భారత్ లో అత్యంత భయానక బీచ్ ఇదే.. పగలు ఆహ్లాదం.. రాత్రయితే భయానకం!
సహజంగా బీచ్ అంటే ఆహ్లాదకరంగా ఉండే ఒక అందమైన పర్యాటక ప్రదేశం. కానీ అటువంటి బీచ్ లలో భయానక ప్రదేశాలు కూడా ఉంటాయి అనే విషయం మీకు తెలుసా.. భారతదేశంలో అత్యంత భయానకమైన బీచ్ గా పేరుపొందిన ఒక బీచ్, సాయంత్రమైతే చాలు అక్కడికి వెళ్ళినవారికి ఆందోళన కలిగిస్తుంది. భయంతో చచ్చిపోయేలా చేస్తుంది. అక్కడ ఇసుక కూడా నల్లగా ఉంటుంది.. ఇంత భయాందోళన కలిగించే అ బీచ్ గురించి మనం తెలుసుకుందాం.
ఆ బీచ్ లో పగలు ఆహ్లాదం .. రాత్రి భయానకం
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నుంచి సుమారు 21 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రం తీరంలో ఉంది డ్యూమాస్ బీచ్. ఈ బీచ్ పగటిపూట అందమైన పర్యాటక స్థలం. నల్లటి ఇసుక, తీరం వెంబడి వీస్తున్న చల్లని గాలి, సముద్రపు అలలు ఇవన్నీ చూస్తే ఇక్కడికి వచ్చినవారు మంత్రముగ్ధులవుతారు. కానీ సూర్యాస్తమయం అయ్యాక ఈ బీచ్ లో ఆహ్లాదం పోతుంది. భయానకంగా మారిపోతుంది.

దేశంలోనే అత్యంత హాంటెడ్ ప్రదేశాల్లో ఒకటి
ఇది భారతదేశంలోనే అత్యంత హాంటెడ్ ప్రదేశాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. దెయ్యాలు, ఆత్మలు తిరిగే ప్రాంతంగా స్థానికులు భయపడతారు. డ్యూమాస్ బీచ్ సాధారణ బీచ్ కాదు. ఇక్కడ ఇసుక నల్లగా ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ హిందువుల శ్మశాన వాటిక ఉండేదని స్థానికులు చెప్తారు. ఇక్కడ ఆత్మలు, దెయ్యాలు సూర్యాస్తమయం తర్వాత తిరుగుతాయని, ఇక్కడకు వచ్చిన అనేకమంది రాత్రి సమయంలో డ్యూమాస్ బీచ్‌లో అనేక భయానక అరుపులు విన్నారని చెప్తారు.
గాలిలో గుసగుసలు.. ఏడుపులు..భయం భయం
చాలా మంది పర్యాటకులు, స్థానికులు గాలిలో వినిపించే గుసగుసలు, అకస్మాత్తుగా వినిపించే నవ్వులు, ఏడుపు శబ్దాలు విన్నట్లు చెబుతారు. కొందరు తమ వెనుక ఎవరో నడుస్తున్నట్లు అడుగుల శబ్దాలు విని వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ ఉండరని, సాయంత్రం అయితే ఇది అత్యంత భయానక ప్రదేశమని అంటారు. రాత్రి సమయంలో బీచ్ వెంబడి నడిచి వెళ్తే తిరిగి రాని వారు కూడా ఉన్నారని చెప్తారు.
చీకటి పడ్డాక ఇక్కడ ఉండవద్దని స్థానికుల హెచ్చరిక
ఒక వ్యక్తి నాలుక బయటపడి చనిపోయినట్లు కూడా వార్తలు ఉన్నాయి. నీడలా కనిపించే ఆకారాలు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో పక్కన నడుస్తున్న అనుభూతి...ముఖ్యంగా అర్ధరాత్రి తర్వాత ఈ భయం ఎక్కువవుతుందని చెబుతారు. స్థానికులు చీకటి పడ్డాక ఇక్కడ ఉండవద్దని హెచ్చరిస్తారు. డ్యూమాస్ బీచ్ దెయ్యాల భయంతో ప్రసిద్ధి చెందిన బీచ్, అయినప్పటికీ ఎంతో మంది పర్యాటకులు దీన్ని చూడడానికి వస్తూనే ఉన్నారు.
ఈ బీచ్ చూడండి కానీ జాగ్రత్త
పగటిపూట దాని అందం ఆస్వాదించి, రాత్రి గురించి విని థ్రిల్ ఫీల్ అయ్యి వెళ్ళిపోతారు. మొత్తానికి దేశంలో పగలు ఆహ్లాదంగా, సాయంత్రం తర్వాత భయానకంగా ఉండే ఈ బీచ్ ను తప్పనిసరిగా చూడండి.. అలాగని అర్దరాత్రి అక్కడ తిరిగే ప్రయత్నం చెయ్యొద్దు.. ఒకవేళ చేస్తే జాగ్రత్త!













Click it and Unblock the Notifications