ఢిల్లీలో ఇరు ప్రాంతాల పోటాపోటీ భేటీలు

సీనియర్ కాంగ్రెసు నేత కె. కేశవరావు నివాసంలో తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సమావేశమయ్యారు. తమలో తాము చర్చించుకున్న తర్వాతనే కమిటీపై మాట్లాడుతామని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆ వెంటనే తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు కేశవరావు నివాసంలో సమావేశమై ఏ విధంగా ప్రతిస్పందించాలనే విషయంపై చర్చిస్తున్నారు. అలాగే సీమాంధ్ర నాయకులు కోస్తాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు నివాసంలో సమావేశమయ్యారు. కమిటీ తెలంగాణ ఏర్పాటుకైతే వ్యతిరేకించాలనేది వారి అభిప్రాయంగా కనిపిస్తోంది.
రాయలసీమకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి బుధవారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్నారు. కమిటీ తెలంగాణ ఇవ్వడానికి కాదని, రాష్ట్ర పరిస్థితిపై మాత్రమేనని, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. కమిటీ ఏర్పాటుతో రెండు ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని ఆయన అన్నారు.