న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం వేసే కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బిఎన్ అగర్వాల్ నేతృత్వం వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన పేరు ఢిల్లీలో ప్రచారంలోకి వచ్చింది. కమిటీలో మొత్తం నలుగురుంటారని తెలుస్తోంది. వీరిలో ఒకర చైర్మన్ కాగా, మిగతా ముగ్గురు వివిధ రంగాలకు చెందినవారుంటారని సమాచారం. ఈ వారంలోనే కమిటీ వేస్తామని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర నాయకులు జోరుగా లాబీయింగులకు దిగారు. మంగళవారం ఓ వైపు సిమాంధ్ర నాయకులు, మరో వైపు తెలంగాణ నాయకులు తమ తమ ప్రయత్నాల్లో బిజీగా గడిపారు. తెలుగుదేశం సీమాంధ్ర నాయకులు ఎర్రంనాయుడు, లాల్ జాన్ పాషా, నిమ్మల కిష్టప్ప మంగళవారం కేంద్ర హోం మంత్రి పి. చిదంబరాన్ని కలిశారు. కాగా, కమిటీ తెలంగాణ ఇవ్వడానికి కాదని, చర్చల కోసమే వేస్తున్నారని సీమాంధ్ర నాయకులు చెబుతున్నారు.
మరో వైపు తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మధు యాష్కీ, మందా జగన్నాథం, వివేక్ మంగళవారం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కనసాగింపునకే కమిటీ వేస్తున్నారని వారంటున్నారు. కేంద్ర ప్రభుత్వం విధివిధానాల రూపకల్పనపై విస్తృతంగా చర్చలు జరుపుతోంది. కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ కమిటీ విధివిధానాలపై మంగళవారం చర్చించినట్లు తెలుస్తోంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి