కడప: కడపలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి సాయి ప్రతాప్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గల్లా అరుణకుమారి, మైనార్టీ సంక్షేమ శాఖమంత్రి అహ్మదుల్లా, ఎమ్మెల్సీ వివేకానందరెడ్డి తదితరులు హాజరు అయ్యారు. వైయస్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సర్వమత ప్రార్థనలు జరిగాయి.
వైయస్ జగన్ కడప జిల్లా పర్యటన మూడురోజుల పాటు ఉంటుంది. లింగాల మండలం కర్ణపాపాయపల్లె గ్రామానికి చెందిన పాలిటెక్నిక్ విద్యార్థిని హేమావతి కుటుంబ సభ్యులను ఎంపీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. చదువులో వెనుకపడ్డానని జనవరి 29న హేమావతి ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎంపీ జగన్ మంగళవారం ఆ గ్రామానికి వెళ్లారు. కుమార్తె మృతితో దుఃఖ సాగరంలో మునిగిన పులివెందుల మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఎం.నాగశేషులరెడ్డి, ఆయన సతీమణి సుకన్యను ఓదార్చి ధైర్యం చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి